ప్రధాని కార్యాలయ సిబ్బందికి సమన్లు జారీ చేస్తాం: సుప్రీంకోర్టు హెచ్చరిక
న్యాయమూర్తుల నియామకంలో చోటుచేసుకుంటున్న ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. నియామకాలు చేపట్టకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఇకనైనా నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని... లేకపోతే, ప్రధాని కార్యాలయ సిబ్బందికి సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. గత తొమ్మిది నెలలుగా కేవలం పేర్లు చెప్పుకుంటూనే కేంద్ర ప్రభుత్వం పబ్బం గడపుకుంటోందని... అపాయింట్ మెంట్లు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల విషయంలో ఆలస్యం పనికి రాదని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. అయితే, నియామకాలను ఆలస్యం చేయడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని... ఒకసారి ప్రక్రియ ప్రారంభమైతే న్యాయమూర్తుల నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని రోహత్గీ కోర్టుకు తెలిపారు.